ఒకే కుటుంబం నుండి వచ్చి ఒకే పాఠశాలలో చదువుకున్న అన్నదమ్ములలో ఒకరు అద్భుతమైన విజయాలను సాధిస్తే మరొకరు సాదాసీదా వ్యక్తిగా ఉండటం చూసే ఉంటారు.
ఒకే అర్హతతో ఉద్యోగంలో చేరినవారిలో కొందరు సంస్ధలో ప్రత్యేక గుర్తింపు పొందగా మిగిలినవారు పదిమందిలో ఒకరిగా మిగిలిపోతారు.
ఒకే తరహా వ్యాపారం ఒకే సమయంలో ప్రారంభించి లాభాలను ఒకరు ఆర్జిస్తే, సరైన దిశలో నడపలేక మూతవేసుకుంటారు మరొకరు.
చదువు అయినా, ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, విజయానికి, వెనకపడటానికి కారణం విజయం సాదించినవారిలో ఉన్న క్రమశిక్షణ.
వెనుకపడిన వారందిరిలో కనిపించే లక్షణం తమ సమయం మీద, పనుల మీద పట్టులేకపోవటం.
ఉదయం త్వరగా లేచి వ్యాయామం చెయ్యటం చాలామందికి ఇష్టం ఉండదు. "అబ్బా అంత పొద్దున్నే లేవటం నా వల్ల కాదు" అని బద్ధకించేవారు "ఇవాళ కాదులే రేపటినుండి చేద్దాము" అని వాయిదా వేసేవారు ఎన్నటికీ క్రమశిక్షణ కలిగినవారు కాలేరు
"తర్వాత చేద్దాము" అనే పదం నచ్చనివారే విజేతలవుతారు.
ఉదయం లేచి వ్యాయామం చేయకపోతే అనారోగ్యమని తెలుసు, వ్యాపారంలో ఎప్పటి లెక్కలు అప్పుడు చూసుకోకపోతే నష్టమొస్తుందని తెలుసు. అయినా వాయిదా వేస్తారు, విఫలమౌతారు. విజేతలు ముందుగా తాము ముగించాల్సిన పనులు ముగించాకే వేరే విషయాలపై శ్రద్ద పెడతారు.
లక్ష్యసాధనకు కృషి, స్వీయ క్రమశిక్షణ ఒక్కరోజులో అలవరచుకునేది కాదు.ఇది సాధనతో సాధించాల్సినది.
లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు దానిని అందుకునే కోరిక ఉన్నప్పుడు దృష్టి మరల్చే అంశాలను పక్కనపెట్టి ముందుకు పరుగు తీయటం సులభమవుతుంది.
ఆలోచనలను నియంత్రించటం కూడా స్వీయ క్రమశిక్షణ లో భాగమే. చేసే ప్రతిపనికి మూలం ఆలోచనలే. అవే మనిషిని అటు ఇటు తీసుకెళ్ళ్తాయి.అవి మనసును గందరగోళం చేయకుండా లక్ష్యము మీదకి మళ్లించే సాధన చేయాలి. స్వీయ క్రమశిక్షణలో దానిని మొదలుపెట్టటమే. దీనికోసం ప్రత్యేకంగా ఒకరోజు కోసం ఎదురుచూడనక్కర్లేదూ. ఇలా తట్టింది ఆలా అమలు చేసి మేలు పొందగలిగిన మార్గం తెలిసినప్పుడు ఇంకా ఎందుకు ఎదురుచూడటం?
త్వరపడక తప్పదు మరి.. అవునంటారా ...?????
No comments:
Post a Comment